Wather Update: ఇప్పుడొస్తాయ్ అప్పుడొస్తాయని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు అదిగో ఇదిగో అంటూ ఇంకా ఆలస్యం అవుతున్నాయి. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి పెరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణకు వడగాలులతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వడగళ్ల వర్షం పడే సూచనలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అంతే కాకుండా.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నేడు అల్లూరి జిలాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పారు. నిన్న ఏన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3°C, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1°C, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఈరోజు అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. వడగాల్పులు, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.