Venkaiah Naidu: ఇడ్లీ కోసం గన్నవరం నుంచి విజయవాడకు వచ్చిన వెంకయ్య నాయుడు

సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచించారు. ఇప్పటి పిజ్జా, బర్గర్స్ ద్వారా ఆరోగ్యాన్ని పాడు‌ చేసుకుంటున్నారన్నారు.

Venkaiah Naidu: విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ ఎస్ఎస్ఎస్ (SSS)ఇడ్లీ సెంటర్ (పాక ఇడ్లీ)లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టిఫిన్ చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తో‌ కలిసి వచ్చిన వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ తిన్నారు. కేవలం ఈ ఇడ్లీ తినడం కోసం ఆయన గన్నవరం నుంచి ప్రత్యేకంగా విజయవాడకు వచ్చారు. ఇడ్లీ తిన్న తర్వాత హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌ను ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు అభినందించారు. క్వాలిటీ ఇడ్లీ అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ‘పాక ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టం’ అని అన్నారు. గతంలో ఒకసారి ఎప్పుడో ఇక్కడ ఇడ్లీ తిన్నట్టు ఆయన గుర్తుచేశారు. నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చినట్టు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

 

సంప్రదాయ వంటలను అలవాటు చేసుకోవాలి: వెంకయ్య (Venkaiah Naidu)

ఈ సందర్భంగా.. సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచించారు. ఇప్పటి పిజ్జా, బర్గర్స్ ద్వారా ఆరోగ్యాన్ని పాడు‌ చేసుకుంటున్నారన్నారు. ఈ కాలం వాళ్లకు కూడా సంప్రదాయ వంటకాలను రుచి చూపించాలని తెలిపారు. ఈ‌ విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ద తీసుకోవాలని సూచించారు. అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమేనని.. అదే విధంగా నాటి సంప్రదాయ వంటలే మనకు బలమన్నారు. శరీరానికి ఎక్స్ ర్ సైజులు ఎంత ముఖ్యమో.. మన సంప్రదాయం వంటకాలు తినడం అంతే ముఖ్యమన్నారు.

 

40 ఏళ్లుగా ఇడ్లీ సెంటర్‌(Venkaiah Naidu)

వెంకయ్య నాయుడు పాక ఇడ్లీ కోసం తన షాపుకు రావడంపై యజమాని కృష్ణప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ ఇడ్లీ సెంటర్‌ను నడుపుతున్నామన్నారు. తన ‌తండ్రి మల్లికార్జున రావు ఈ హోటల్‌ను స్థాపించారని.. పాక ఇడ్లీగా ప్రసిద్ధి చెందిదన్నారు. ఇక్కడకు ప్రముఖులు కూడా వస్తుంటారని.. తాజాగా వెంకయ్య నాయుడు తమ హోటల్‌లో టిఫిన్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆయన హఠాత్తుగా హోటల్ కు రావడంతో తామంతా ఆశ్చర్య పోయామని పేర్కొన్నారు.