Vangaveeti Ranga Jayanthi : వంగవీటి మోహన రంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్లుండరు. ప్రస్తుతం కొందరు అయితే ఆయన ఓ వర్గానికి బ్రాండ్ అని చెప్తున్నప్పటికి.. అణగారిన వర్గాల కోసం అనునిత్యం ఆయన పోరాడారు.. అందరివాడయ్యారు. ఆయన చనిపోయి 35 ఏళ్ళు గడచినా రంగా పేరు మాత్రం ఏపీలో మారుమోగుతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికల వేళ ఆయన పేరు తలచుకుంటూ రాజకీయ పార్టీలు రంగాను తమ వాడిగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈసారి అయితే వంగవీటి రంగా జయంతి మరీ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది కూడా వ్యవధి లేకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దాంతో పాటు ఈసారి ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన పాత్ర పోషించనున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక రంగా.. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి కేవలం 3 ఏళ్ళు మాత్రమే శాసన సభ్యుడిగా పని చేసినా రాజకీయాలపై రంగా ప్రభావం నేటికీ సజీవం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రంగా ప్రకంపనలు సృష్టించారని చెప్పొచ్చు. అందుకే ఈ క్రమంలోనే.. ఏపీ వ్యాప్తంగా రంగా జయంతి కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు.
టీడీపీ, జనసేనతో పాటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున రంగా జయంతిని చేసింది. వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రంగా జయంతి వేడుకలకు ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.