Site icon Prime9

Kuppam Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్ధుల దుర్మరణం

kuppam accident

kuppam accident

Kuppam Accident: చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తోటి విద్యార్ధి పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన ఆ విద్యార్ధులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

ముగ్గురు విద్యార్థుల దుర్మరణం (Kuppam Accident)

ఆ విద్యార్ధులు ఉన్నత చదువులు చదివారు. త్వరలోనే ఉద్యోగాలు చేయాలని కలలు కన్నారు. కానీ అంతలోనే వారి ఆశలను విధి ఛిదిమేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కన్నవారికి దూరం చేసింది. తమ కొడుకులు మంచి ఉద్యోగాలు సాధించి.. సమాజంలో గొప్పగా జీవిస్తారని అనుకున్నా తల్లిదండ్రుల కలలను తుంచేసింది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది. శ్రీ వికాస్‌రెడ్డి, ప్రవీణ్‌, కల్యాణ్‌ వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారులు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. చదువుల్లో ఉన్నతంగా రాణించారు. కానీ రోడ్డు ప్రమాదం ఈ ముగ్గురిని బలి తీసుకుంది.

ఆదివారం ఉదయం.. స్నేహితుని కారు తీసుకుని శ్రీవికాస్‌రెడ్డి, ప్రవీణ్‌తో కలిసి కుప్పానికి బయలుదేరారు. చిన్నశెట్టిపల్లె వద్ద ముందు వెళ్తున్న లారీ ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. నిద్ర పట్టడం లేదని షికారుకెళ్లిన ముగ్గురు విద్యార్థులు ఇక తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుప్పం ఆస్పత్రికి చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారులపై ఎన్నో ఆశలు పెంచుకున్నామని.. ఇంతలో తమ ఆశలు తుంచేసి వెళ్లిపోయారా అని గుండెలవిసేలా రోదించారు.

ఏకైక కుమారులు.. తీరని విషాదం

ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కూడా.. వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం మరో విషాదం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్నామని.. కష్టపడి వారిని చదివించుకున్నామని బోరున విలపించారు. మంచి ఉద్యోగాలు చేసి మా పేరు నిలబెడతారని కలలుగన్నామని కన్నీటి పర్యంతమయ్యారు. వారి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ప్రమాదం భయంకరంగా జరిగింది. కారు వేగానికి ఆనవాలు కూడా లేకుండా పోయాయి. కారు పూర్తిగా తుక్కుతుక్కుగా మారింది. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version