Ambati Rayudu : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాయుడు ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. సీఎం జగన్ అంబటిని, అతను ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ను అభినందించారు. ఇద్దరి మధ్య దాదాపు అరగంటపాటు చర్చలు జరిగాయి. జగన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు అక్కడి నుంచి ఇంటికి బయలు దేరారు.
ఐపీఎల్‌లో అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించిన సీఎస్‌కే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి, ఐదో సారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ఆడి రాయుడు ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున చివరి మ్యాచ్ ఆడారు. త్వరలోనే తన సెకండ్ సైడ్ చూస్తారని మే 30న అంబటి రాయుడు ట్వీట్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు సీఎం శంకుస్థాపన చేసిన వీడియోను రీట్వీట్ చేసినప్పటి నుంచి అంబటి YCPలో చేరడం తథ్యమనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అందరికీ జగన్‌పై నమ్మకం విశ్వాసం ఉన్నాయని అంబటి ట్వీట్‌లో కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌పై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు కూడా రాయుడు ఓసారి సీఎంను కలిశారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు. రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారని . గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరి.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే రాయుడు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.