Site icon Prime9

Kodela Sivaram : కన్నాకు సత్తెనపల్లి ఇన్చార్జ్ ఇవ్వడంపై కోడెల శివరాం ఫైర్.. పార్టీ మారి వచ్చిన కన్నాకు ఉన్న గౌరవం.. మాకు లేదా అని ప్రశ్న

tdp leader kodela sivaram fires on kanna lakshmi narayana

tdp leader kodela sivaram fires on kanna lakshmi narayana

Kodela Sivaram : తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు ఇంచార్జ్ గా బాధ్యతలు ఇవ్వడంపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవుల కోసం కన్నా మూడు పార్టీలు మారారు అంటూ విమర్శలు చేశారు. మూడు పార్టీలు మారిన కన్నాకు..నా తండ్రి కోడెల శివప్రసాద్ కు పోలికా? అంటూ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో కోడెల వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్లుగా సాగిందని అన్నారు. కన్నా కాంగ్రెస్ లో ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తుంటే తన తండ్రి శివప్రసాద్ వారికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. అటువంటి కన్నాకు సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా నియమించటంతో కోడెల శివరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అలానే ఆయన మాట్లాడుతూ.. కన్నాకు మాకు వ్యక్తి గతంగా గొడవలు లేవని..కానీ రాజకీయంగానే మాకు వారికి విభేదాలు ఉన్నాయన్నారు. టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కోడెల శివ ప్రసాద్ పార్టీ కోసం కష్ట పడ్డారని.. తన ప్రాణాలకు తెగించి పల్నాడు ప్రాంతంలో కోడెల టిడిపి జెండా మోసారని ఈ సందర్భంగా కోడెల శివరాం గుర్తు చేశారు. మా కుటుంబం చంద్రబాబును కలవనీయకుండా కేంద్ర కార్యలయంలో కొంతమంది చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు చంద్రబాబుకి తెలియకుండా చేస్తున్నారన్నారు. మా కుటుంబంపై ఎందుకు కక్ష కట్టారు ? కోడెల ఆశయ సాధన కోసం నా పోరాటం కొనసాగుతుందని శివరాం స్పష్టం చేశారు.

కన్నాకు ఇన్ చార్జ్ ఇచ్చేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదని.. పార్టీలు మారి వచ్చిన కన్నాకు ఇచ్చిన గౌరవం కోడెల కుటుంబంపై ఎందుకు లేదు..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తుల మీద కేసులు వేసి టిడిపిపై పోరాటం చేసిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని గుర్తు చేశారు. టిడిపి మాకు న్యాయం చేస్తుందని నమ్మతున్నాం అని.. కానీ నేడు కోడెల పేరు చేరిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో వుండగా మాపైనా మా కార్యకర్తలపై అనేక కేసులు బనాయించారని అటువంటి వ్యక్తికి ఇప్పుడు సత్తెనపల్లి ఇన్చార్జ్ గా నియమించటం సరైంది కాదన్నారు. చంద్రబాబు అనేక సార్లు తిట్టి, కేసులు పెట్టిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఎక్కువైపోయారా? అంటూ ప్రశ్నించారు. అటువంటి కన్నా సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా ఇవ్వడం దేనికి సంకేతంగా చంద్రబాబు భావిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో ఏపీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

Exit mobile version