Chinthamaneni Prabhakar : తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన చొక్కా చించివేశారంటూ నిప్పులు చెరిగారు. జనవరి 3న చింతమనేని పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్వహిస్తున్న బ్లడ్ క్యాంపుని సందర్శించేందుకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు అడ్డగించారు. ఈ ప్రక్రియలో చిరిగిన బట్టలతోనే ప్రెస్ ముందుకి వచ్చిన చింతమనేని వైకాపా ప్రభుత్వంపై, పోలీసులపై మండిపడ్డారు.
మరోవైపు కాపులకు రేజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న హరిరామ జోగయ్య అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏం తప్పు చేశానని నా చొక్కా చించేశారు? అంటూ చింతమనేని నిలదీశారు. తన పట్ల డీఎస్పీ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనుకోవడం నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
హరిరామ జోగయ్య అదే ఆసుపత్రిలో ఉన్నారన్న కారణంతో తనను అడ్డుకున్నారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి… అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శించారు. మీరు చించినవి నా బట్టలు కాదు ప్రజల బట్టలు… అధికారం లో ఉన్న వారి మాటలు విని అధికారులు టీడీపీ నాయకులని ఇబ్బంది పెడితే రేపు తాము అధికారం లో కి వచ్చిన తర్వాత వారికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అని హెచ్చరించారు.
కేవలం అభిమానులు నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమాన్ని సందర్శించడానికి వెళుతున్న నన్ను పోలీస్ లు ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నారన్నారు. తనపై ఇప్పటికే 31 కేసులు పెట్టారని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని హెచ్చరించారు.