Site icon Prime9

Road Accident : తూర్పుగోదావరి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

road accident in east godavari leads to 3 death

road accident in east godavari leads to 3 death

Road Accident : తూర్పుగోదావరి జిల్లాలో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడిలోని కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా.. కల్వర్టు పైకి ఎక్కబోయి అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని సమాచారం అందుతుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మారేడుమిల్లిని చూసేందుకు నిన్న ఉదయం ఏలూరు నుంచి ఆరుగురు బయలుదేరారు. వీరు ఏలూరు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మారేడుమిల్లి తదతర ప్రాంతాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో కోరుకొండ దాటుతుండగా ప్రమాదం జరిగింది. కల్వర్టు పైకెక్కే క్రమంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ లోతుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది.

ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడి ఒడ్డుకు చేరుకున్నారు. మరో ముగ్గురు నీటిలో గల్లంతు అవ్వగా.. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ తో సహాయక చర్యలు చేపట్టి కారును బయటికి తీశారు. గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికి తీశారు. వీరందరూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి ప్రణీత్, వంశీ, హేమంత్ సురక్షితంగా బయటపడ్డారు. ఉదయ్ కిరణ్, టి.హేమంత్, హర్షవర్ధన్ మృతి చెందగా, వారి మృతదేహాలు లభ్యం అయ్యాయి. వివరాయాత్రకు అని వచ్చి విద్యార్ధులు ఇలా తుదిశ్వాస విడవడం పట్ల వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

 

Exit mobile version