Amaravati: పాదయాత్ర కాదు, అది ఒళ్లు బలిసిన యాత్రగా రాజధాని రైతుల పాదయాత్రనుద్ధేశించి మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రను అడ్డుకొనేందుకు ప్రభుత్వానికి 5 నిమిషాలు పట్టదు అన్న మంత్రి బొత్స మాటల వేడి చల్లారకముందే వైకాపా మంత్రులు మరోమారు రాజధాని రైతుల పాదయాత్రను చులకన చేస్తూ మాట్లాడంతో వ్యవహారం మరోమారు హీటెక్కింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా పార్టీ చేయూత కార్యక్రమ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి అంబటి మాట్లాడుతున్న సమయంలో పాదయాత్ర విషయం ప్రస్తావనలోకి వచ్చింది. దీనిపై మంత్రి స్టేజిపై ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అది పాదయాత్ర కాదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు బిత్తరపోయారు. పాదయాత్రను బాగా గమనించండి. వాళ్లంతా ధనికులే, మీరే చెప్పండి అంటూ ఒళ్లు బలిసి పాదయాత్రను చేపట్టారని మరోమారు అన్నారు. ఆ సమయంలో మంత్రి మాటలకు ఎక్కడా హర్షధ్వానాలు కాని, చప్పట్లు కాని లేకుండా ప్రజలు అందరూ నిశబ్ధంగా ఉండిపోయారు.
సమావేశంలో జనసేన అధినేత పవన్ పై కూడా మంత్రి పరుషంగా మాట్లాడారు. జనసేన కార్యకర్తలు పవన్ ను సిఎంగా ఉండాలని భావిస్తున్నారని, అయితే పవన్ చంద్రబాబు సిఎం అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నాడని ఎద్దేవా చేసారు. సీఎం జగనే తిరిగి అధికారంలోకి వస్తాడని మంత్రి అంబటి ఘంటాపదంగా మాట్లాడారు. మరో సంవత్సర కాలంలో వైకాపా ప్రభుత్వం మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని మంత్రి గొప్పగా చెప్పారు. అభివృద్ధి అంటూ హైదరాబాదుకు ప్రాధాన్యత ఇస్తే ప్రస్తుతం ఆంధ్రుల పరిస్ధితి ఏ విధంగా తయారైందో గుర్తించాలని సభికులనుద్ధేశించి మంత్రి అంబటి పేర్కొన్నారు. అందుకే సీఎం జగన్ మూడు రాజధానులకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: లిమిట్స్ దాటొద్దు.. షర్మిలకు జగ్గారెడ్డి వార్నింగ్