Monsoon Weather Update: తెలుగు రాష్ట్రాలను ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు పలకరించాయి. తొలకరి చినుకులతో తెలుగు రాష్ట్రాలు మురిసిపోయాయి. ఒక్కసారిగా కురిసిన చిరు జల్లులతో నేల పరవసించిపోయింది. ఇన్నాళ్లూ భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వడగాలులతో ఉడికిపోయిన ప్రజలు తొలకరి వాన చినుకులు పడటంతో సేదతీరారు. కమ్ముకొచ్చిన కారుమేఘాల్ని చూసి అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ వడివడిగా పొలం పనులు ప్రారంభిచేందుకు రెడీ అవుతున్నారు. మూడు రోజుల క్రితమే నైరుతి మేఘాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చినా కానీ భానుడి వేడిమికి వాతావరణంలో మార్పు కనిపించలేదు. దానితో వాన జాడ కనిపించలేదు, కానీ బుధవారం సాయంత్రానికి ఈ సీన్ కాస్త మారింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ వెంటనే చిరు జల్లులు కురిశాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడడం వల్ల తెలుగు ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
నైరుతి మేఘాలకు ఎంట్రీపాయింట్ అయిన రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఒక రేంజ్‌లో వర్షం దంచికొట్టింది. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగులు పడ్డాయి. తొలకరి చినుకులకే హైదరాబాద్లో వాతారవణం అంతా మారిపోయింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వాన విరుచుకుపడింది. పలు చోట్ల భారీ వర్షం పడింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అత్యధికంగా 2.2 సెం.మీ వర్షపాతం నమోదవ్వగా.. మాదాపూర్, బీహెచ్‌ఈఎల్‌లో 1.8, ఖాజాగూడ, హఫీజ్‌పేట, చర్లపల్లిలో 1.7, ఏఎస్‌రావునగర్, జూబ్లీహిల్స్, హైదర్‌నగర్‌లో 1.5, మల్లాపూర్, తిరుమలగిరి, కాప్రాలో 1.2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.