Kurnool Double Murders Case : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు లో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. తోడికోడళ్ళు రేణుక, రామేశ్వరి ల హత్యలకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనలో ఓ చెప్పు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందరిని ఆశ్చర్యపరిచేలా ఈ ఘటనలో వారి భర్త, మామలే నిందితులుగా తేలినట్లు సమాచారం అందుతుంది. కాగా మూఢనమ్మకాల నేపధ్యంలోనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే…
నన్నూరుకు చెందిన గోగన్న, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పెద్ద రామగోవిందుకు రామేశ్వరితో వివాహమైంది. చిన్న కుమారుడు చిన్న రామగోవిందుకు రేణుకతో పెళ్లి చేశారు. ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. ఆస్తులు ఉండి కుటుంబం మొత్తానికి పిల్లలు లేకపోవడం వారిని పూర్తిగా కలిచి వేసింది. అదే విధంగా బోగన్న కూడా ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఓ నాటు వైద్యునికి వెళ్లగా తెలిసిన వారే మరుగు మందు పెట్టించారని చెప్పడంతో… రామేశ్వరి, రేణుకలపై అనుమానం మొదలైంది.
దీంతో ఎలాగైనా వారిద్దరినీ అడ్డు తొలగించి, కొడుకులకు వేరే వారితో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. కొడుకులకు కూడా ఈ విషయాన్ని చెప్పడంతో… వారు కూడా తండ్రి మాటకి ఒకే అన్నారు. ఇక బుధవారం నాడు అన్నదమ్ముల్దిరూ తమ భార్యలను పొలానికి తీసుకెళ్లి వదిలి పెట్టి వచ్చారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత తమ భార్యలు ఇంటికి రాలేదని నటిస్తూ.. తిరిగి పొలానికి వచ్చి అక్కడ ఎవరో తమ భార్యలను హత్య చేశారని గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులను నమ్మించారు. అయితే పోలీసులకు ఒక్క ఆధారం దొరికిన చాలు నిందితులను పట్టుకోవడానికి అని మర్చిపోయినట్లున్నారు.
హత్య చేసిన తర్వాత నిందితులు పరారవుతున్న సమయంలో ఒకరి చెప్పు ఘటనా స్థలంలోనే పడిపోయింది. స్థానికులు దానిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మామ భోగన్న సాయంత్రం కర్నూలులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స కోసం చేరాడు. దీంతో తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తే మిస్టరీ వీడినట్లు సమాచారం.
బుధవారం నాడు పొలానికి వెళ్ళిన బోగన్న రామేశ్వరి, రేణుక ఇద్దరూ పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా… వాళ్లను కర్రతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆ దెబ్బలకు తాళలేక కింద పడిపోగా రాళ్లతో వారి మొఖంపై మోదినట్లు తెలుస్తోంది. దీనికి కొడుకులు ఇద్దరు సహకరించారని… పథకం ప్రకారమే రేణుక, రామేశ్వరి హత్య చేశారని పోలీసుల దర్యాప్తు తేలింది. పోలీసులు పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.