Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది.
కాగా ఈరోజు పలు కేసుల్లో చంద్రబాబుకు ఒక వైపు ఊరట లభించగా.. మరోవైపు షాక్ తగిలింది. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాత్రం వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అదే విధంగా బుధవారం సాయంత్రం ఫైబర్ నెట్ కేసులో వాదనలు విననున్నారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ భోజన విరామం తర్వాత హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ శ్రీరామ్ కోరారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని.. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు చేయవద్దని క్రతు ఆదేశించింది.