Site icon Prime9

CM Jagan : “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..

jaganannaki chebudam programme started by cm jagan

jaganannaki chebudam programme started by cm jagan

CM Jagan : ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కారం చేసేందుకు వైకాపా ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలో ఇప్పటికే ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించేందుకు ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దీనితో పాటు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తన పాదయాత్రలో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కనిపించిన సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పాలన సాగించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని తెలిపారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని చెప్పారు. 1902కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వైఎస్సార్‌ (యూవర్ సర్వీస్ రిఫరెన్స్) ఐడీ కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఆ ఫిర్యాదులను ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. సమస్యను ట్రాక్ చేస్తూ ఐవీఆర్ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా స్టేటస్‌ను తెలియజేయం జరుగుతుందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

గతంలో తెదేపా హయాంలో పరిస్థితి అది.. అందుకే ఇప్పుడు ఇలా – సీఎం జగన్ CM Jagan

రాష్ట్రంలో 90 నుంచి 95 శాతం సమస్యలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని .. గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా పథకాలకు పొందాలంటే జన్మభూమి కమిటీలు ఏ పార్టీ అని అడిగి వాటిని ఇచ్చేవని ఆరోపించారు. పెన్షన్ల దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపుల దాకా.. ఏ పథకం తీసుకున్నా వివక్ష, లంచాలు కనిపించేవి. మేం ఇవ్వగలిగింది ఇంతే.. ఊర్లో ఇంత మందికే ఇస్తాం. మిగిలిన వాళ్లకు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న వాళ్లలో ఎవరైనా చనిపోతేనో, తప్పుకుంటేనో తప్ప ఇవ్వలేం అని చెప్పేవాళ్లు. అర్హులందరికీ పథకాలు అందజేయాలన్న ఉద్దేశం వారికి ఎన్నడూ లేదు. అర్హులందరికీ పథకం అందించే పరిస్థితి రావాలి. లంచాలు లేకుండా ఇవ్వగలగాలి అని అన్నారు.

కలెక్టర్ల నుంచి కమిషనర్ల వరకు, సచివాలయాల దాకా అందరినీ భాగస్వాముల్ని చేస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్నట్లు జగన్ తెలిపారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఇదో మంచి వేదిక అవుతుందన్నారు. ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు నేరుగా 1902కు ఫోన్ చేయాలని సూచించారు. మీరు చేసే ఫిర్యాదులు నేరుగా తన కార్యాలయానికే వస్తాయన్నారు. ఇది నేరుగా ముఖ్యమంత్రికే చెబుదామనే గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినా కూడా జరగకపోతే.. తాము చూపించే పరిష్కారంతో వారి ముఖంలో చిరునువ్వు చూసేలా ఈ కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు.

Exit mobile version
Skip to toolbar