Nellore: దేశంలో విధ్వంసకర, మతోన్మాద పాలన సాగిస్తోన్న ప్రధాని మోదీకి సీఎం జగన్ స్వాగతం పలకడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 11న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన నెల్లూరులో ఈ మాటలన్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు జగన్ సర్కారు ఏర్పాట్లు చేయడాన్ని తప్పుబట్టారు.
ఏపీ సమస్యలు ఏంతీర్చారని ప్రధాని ఏపీకి వస్తున్నారన్నారు. విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. చివరికి విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు. అయితే రైల్వేజోన్ వచ్చేస్తుందని వైకాపా నేతలు అవాస్తవాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో 22మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఉన్నారని, ఏపీకి సంబంధించిన వాటిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. మెడలు వంచి రాజన్నపాలన తెస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్ మోదీకి స్వాగతం పలుకుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం బాధాకరమన్నారు. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు ఉక్కు కర్మాగార కార్మికులతో సమ్మె చేపడుతున్నాం. బీజేపీ, వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై నిరంతరం పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
మరో వైపు 12వ తేదీన తెలంగాణాకు ప్రధాని రానున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు అనంతరం ప్రధాని వస్తుండడంతో ఇక్కడి పాలకులు మోదీ పై గుర్రుగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకొంటామని చెప్పేశారు. ఏపీలో మాత్రం కేవలం సమ్మెకు మాత్రమే దిగడాన్ని ప్రజలు నిశతంగా గమనిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కమ్యూనిస్టుల భావాలు మాత్రం రెండుగా ఉండడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Union Home Ministry: విభజన సమస్యల పై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం