Site icon Prime9

Nellore Bread Festival : నెల్లూరులో నేటి నుంచి ఐదు రోజులపాటు రొట్టెల పండుగ..

interesting details about nellore bread festival

interesting details about nellore bread festival

Nellore Bread Festival : ప్రతి ఏడాది ఎంతో ఘనంగా మతసామరస్యానికి అద్దం పట్టేలా..  నిర్వహిస్తున్న నెల్లూరులో రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ మేరకు నెల్లూరు లోని స్వర్ణాల చెరువు, బారాషహీద్‌ దర్గా వద్ద ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ పండుగలో పాల్గొనేందుకు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రతి ఏటా పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కూడా  ఈ వేడుకలో పాల్గొనడం మనం గమనించవచ్చు.

నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. పండుగలో భాగంగా నేడు సందన్ మాలి (సమాధుల శుభ్రం), రేపు గంధ మహోత్సవం, 31వ తేదీన రొట్టెల పండుగ, ఆగస్టు 1వ తేదీన తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ), 2వ తేదీన పండుగ ముగింపు ఉంటాయి. కాగా కుల, మతాలకు అతీతంగా చెరువు వద్ద ఉన్న బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే పండుగనే రొట్టెల పండుగగా పిలుస్తారు.

 

 

1930లో మొదలైన ఈ రొట్టెల పండుగ క్రమం తప్పకుండా జరుగుతూ వస్తుందని చెబుతుంటారు.. కోరికలను కోరుకోవడం.. అవి నెరవేరితే.. మరుసటి ఏడాది రొట్టెలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె.. ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేయడం భక్తుల నమ్మకంగా ఉంది. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు.

Exit mobile version