Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన నారా లోకేష్ విచారణ.. మళ్ళీ ఎప్పుడంటే ?

తెదేపా కీలక నేత నారా లోకేశ్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయాంలో 10 గంటల తర్వాత విచారణ మొదలవగా.. సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగింది. కాగా వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 07:50 PM IST

Nara Lokesh : తెదేపా కీలక నేత నారా లోకేశ్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయాంలో 10 గంటల తర్వాత విచారణ మొదలవగా.. సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగింది. కాగా వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్ ను ఇవాళ (అక్టోబరు 10) విచారించారు.

ఈ విచారణలో భాగంగా ఆయనను 30 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. విచారణకు లోకేష్ ఏమాత్రం సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేష్‌ను ఆదేశించింది. అయితే విచారణ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ఆరున్నర గంటలు విచారణ జరిగిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అడగలేదని.. ప్రశ్నల్లో ఒక్కటి కూడా కుటుంబ సభ్యులు ఎలా బాగుపడ్డారని అడగలేదని లోకేష్ తెలిపారు.

కక్ష సాధింపు తప్ప.. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్‌లు పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని.. మళ్లీ రేపు విచారణకు హాజరవుతానని లోకేష్ స్పష్టం చేశారు. అలైన్‌మెంట్‌కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారని తెలిపారు. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని.. మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన జీవోఎం వివరాలు అడిగారని ఆయన వెల్లడించారు.