Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలు జనవరికి 26 కి వాయిదా పడింది. వాస్తవానికి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై రేపటి నుంచి నిషేధం అమల్లోకి రావాల్సి ఉంది.
అయితే సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు విజ్ఞప్తి చేసారు. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈలోగా వారికి చేదోడుగా నిలవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలని అన్నారు. సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సి తయారీ దారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తాజా నిర్ణయంతో ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26 కి వాయిదాపడింది. కాలుష్యాన్ని నివారించడానికి, పర్యావరణ హితంకోసం ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.