Amaravati Master Plan : అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పుపై 17 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలి.. ఏపీ హైకోర్టు

రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - November 11, 2022 / 07:51 PM IST

Amaravati Master Plan: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభలు నిర్వహించకుండా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రైతుల తరపున హైకోర్టు లో శుక్రవారం లంచ్ మోషన్ పిటీషన్‌లు దాఖలయ్యాయి. మందడం, లింగాయపాలెం గ్రామాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించింది. అదే విధంగా మిగతా 17 గ్రామాల్లో రెండు రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ , ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాల సవరించారు. ఈ చట్టం ఆధారంగా సర్కార్ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసింది. దీనితో అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా ఇతర ప్రాంతాల వారికీ కూడా ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. అమరావతిలో ఇతరులకు స్థలాలు కేటాయింపుపై రైతులు మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేసారు.

విచారణ పూర్తయ్యే వరకూ భూములు వేరేవారికి ఇవ్వకుండా.. ఆదేశాలు ఇవ్వాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు. కొత్తచట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. స్థలాలు కేటాయింపునకు మరో నాలుగు వారాల సమయం పడుతుందని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది స్టేట్‍మెంట్‍ను రికార్డ్ చేస్తున్నామని చెప్పిన ధర్మాసనం ఈ స్టేట్‍మెంట్‍కు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. రైతుల తరపు లాయర్లు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై ఈనెల 20లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది