Andhra Pradesh: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్ట సవరణకు ఆయన ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జీవో జారీతో డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా పేరు అధికారికంగా మారింది.
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ఈ అంశం పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. వర్సిటీ పేరు మార్పును ఇతర విపక్ష పార్టీలు సైతం తప్పుబట్టాయి.
అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 21న వర్సిటీ పేరు మార్పు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదం కూడా తెలిపి గవర్నర్‌కు పంపించారు. తాజాగా గవర్నర్ దీనికి ఆమోద ముద్ర వేశారు. దీంతో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్సార్ వర్సిటీగా మారింది.