Amaravathi Inner Ring Road Centre : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. దీంతో ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కేసులో ఆయన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు.
దీంతో నారాయణ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో నారా లోకేశ్ కు వాట్సాప్ లోనూ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. తాను నోటీసులు అందుకున్నానని.. నారా లోకేశ్ వాట్సాప్ లో రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 4వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇటీవల ఏ 14గా లోకేష్ పేరు చేర్చారు.
చంద్రబాబు హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ పేరిట భారీ అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని ఆళ్ల కోరారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా నారాయణ పేరును సీఐడీ ఈ కేసులో చేర్చింది.