Harirama Jogaiah : టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోలేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాపు కులస్తుల అవసరం మీకు ఉన్నదని రుజువు చేసుకోవాలన్న కాపుల పట్ల సానుభూతి ఉన్నా.. టీటీడీ చైర్మన్ బలిజకి ఇవ్వాలని కాపు కులస్తుల తరఫున కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
ఈ మేరకు ఆ లేఖలో.. రాష్ట్రంలో కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరి కులస్తులు దాదాపు 22శాతం జనాభా ఉన్నట్టు మీకు తెలుసు. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారి దగ్గర నుండి ఈ రోజువరకు ఈ కులస్తులను వాడుకోవడమే గాని, కనీసం రిజర్వేషన్స్ సౌకర్యం కూడా కలుగచేయడానికి ఏ రెడ్డి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. రాజశేఖర్రెడ్డిగారు. సైతం అవకాశం ఉండి కూడా ఈ జాతిని రిజర్వేషన్స్ కలుగచేయడంలో నిర్లక్ష్యం చేసారు. మీరు కూడా కాపు సంక్షేమం విషయంలో కాపులు చెప్పుకుంటేనే కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఖర్చుపెట్టవలసిన నిధులను ఖర్చుపెట్టకపోవడమే కాక, జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు రెడ్డి కులస్తులతో పోల్చుకున్నప్పుడు ఇవ్వకపోవడం, జనాభా ప్రకారం దక్కవలసియున్న రిజర్వేషన్స్ సౌకర్యం కలుగచేయకపోవడం గమనిస్తూనే ఉన్నాము. ఈ చర్యలు చూసుకుంటే కాపు కులస్తుల పట్ల మీకెంత ప్రేమ ఉందో తెలుస్తూనే ఉంది.
ఈ నెలలో టి.టి.డి. చైర్మన్ పదవి పునఃనియామకం చేయబోతున్నా రనేది వార్త. ఈ సందర్భంగా కాపు కులస్థుల అవసరం మీకు ఉన్నదని రుజువుపరచుకోదలిచినా, కాపుల పట్ల సానుభూతి ఉన్నా కాపు కులస్థులకు ప్రత్యేకించి రాయలసీమలో 20లక్షల జనాభా కలిగియున్న బలిజ కులస్థులలో ఒకరికి టి.టి.డి. చైర్మన్ పదవి ఇవ్వవలసినదిగా కాపు కులస్థుల తరపున మిమ్మల్ని కోరుచున్నాను. భవిష్యత్ లో కాపు కులస్థుల సహకారం అందుకోదలిస్తే తెలివైన మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ.. లేనిచో మీకు ఏమాత్రం కాపుల పట్ల ప్రేమ కాని, సానుభూతి కాని లేనట్లేనని భావించవలసి వస్తుందని హరిరామ జోగయ్య (Harirama Jogaiah) రాసుకొచ్చారు.