YS Jagan Reacts on Vallabhaneni Vamsi Arrest: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమన్నారు.
అదే విధంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వీడియోను కోట్లమంది ప్రజలు చూశారని, మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందులోనూ 307 అంటే హత్యాయత్నం కేసులు పెట్టడమేంటి? అని ప్రశ్నించారు.
అందులోనూ బాధితులపై రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? ధ్వజమెత్తారు. చంద్రబాబుగారూ! ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఈ హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని, అంతకుముందున్న పథకాలను సైతం రద్దు చేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాశ్యాలతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారని ఆరోపించారు. మీ తప్పులను ప్రజలు తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్ జగన్ హెచ్చరించారు.