Site icon Prime9

Dalit Boy : ఏలూరు జిల్లాలో దారుణ ఘటన.. దళిత బాలుడిపై అనుమానంతో ఘోరమైన చర్య

dalit boy brutally beaten and harassed by ycp activists in eluru

dalit boy brutally beaten and harassed by ycp activists in eluru

Dalit Boy : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో  ముగ్గురు వ్యక్తులను స్థానిక వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిలో ఒక దళిత బాలుడిని కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించి.. కటింగ్‌ప్లేయర్‌తో మర్మాంగాలను నొక్కిపట్టి.. చేతిపై చర్మాన్ని కత్తిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పిన సురేష్‌, అరటికట్ల రాంబాబుతో పాటు ఓ దళిత బాలుడిని ఈ నెల 25వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన అప్పసాని ధర్మారావు, కొనకళ్ల అప్పారావు, ఆచంట రాకేష్‌, ఘంటా శేఖర్‌, తోకల సిద్ధిరాజు, మురుగుల దుర్గారావులు పని ఉందని చెప్పి నాటుకోళ్లు పెంచే తోటలోకి తీసుకెళ్లారు. మా కోళ్లను దొంగిలించింది మీరేనా అని గద్దిస్తూ, దుస్తులు విప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు.

చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే కర్రలు, ప్లాస్టిక్‌ పైపులతో కొట్టి, చిత్రహింసలు పెట్టారు. వీపుపై వాతలు తేలిన దెబ్బలతో బాధితులున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. బాధితుల్లో ఒకరైన దళిత బాలుణ్ని ‘మా కోళ్లనే దొంగతనం చేస్తావా.. ఈ రోజు మా చేతుల్లో చచ్చిపోతావ్‌’ అంటూ కులం పేరుతో దూషించారు. అందరూ చూస్తుండగానే దుస్తులు తీయించి కటింగ్‌ప్లేయర్‌తో మర్మాంగాలను నొక్కిపట్టి.. చేతిపై చర్మాన్ని కత్తిరించారు.

ఈ విషయంపై ముప్పిన సురేష్‌, అరటికట్ల రాంబాబు గురువారమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్ని పోలీసులు ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి.. కొట్టడం వల్లే గాయాలయ్యాయని నిర్ధారించడంతో నిందితులైన ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్‌ తెలిపారు. ముగ్గురిని అర్ధనగ్నంగా నిలబెట్టి కర్రలతో దాడి చేశారని, బాలుడి మర్మాంగాలపై దాడి చేసిన ఆనవాళ్లు లేవని ఆయన చెప్పారు. నిందితులు తమ పార్టీ కార్యకర్తలు కావటంతో స్థానిక వైకాపా నాయకులు వారిని తప్పించేందుకు బాధితులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందుతుంది.

 

Exit mobile version