CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలానే నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద నగరం, అందరికి ఆమోదయోగ్యమైన విశాఖలోనే తాను సెప్టెంబర్ నుంచి కాపురం పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు.
మూలపేట.. ఇక మూలన ఉన్న ఒక పేట కాదని.. అభివృద్దికి మూల స్తంభంగా నిలుస్తుందని అన్నారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో, రాబోయే తరానికి ముంబై, మద్రాసు కానున్నాయని చెప్పారు. 24 నెలల్లో పోర్టు పూర్తవుతుందని.. దీని నిర్మాణానికి రూ. 4,362 కోట్లు ఖర్చు చేయనున్నట్టుగా తెలిపారు. పోర్టు పూర్తైన తర్వాత మన పిల్లలకు ఇక్కడే ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల ఉద్యోగాలు లభిస్తాయి’’ అని జగన్ చెప్పారు. పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్టుగా చెప్పారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. తీరప్రాంతంలో గతంలో ఇలాంటి అభివృద్ది ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయలేదు – సీఎం జగన్ CM Ys Jagan
ఉద్దానంలో కిడ్ని సమస్యకు పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయలేదని.. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు పూర్తికావచ్చాయని.. జూన్‌లో తనే వచ్చి దానిని ప్రారంభించనున్నట్టగా వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 46 నెలల కాలంలో నాలుగు కొత్త మెడికల్ కాలేజ్‌లో నిర్మించడం జరుగుతుందని చెప్పారు. మే 3వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానశ్రయానికి, అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలిపారు. మంచి చేశామని చెప్పుకోవడానికి ఏమిలేని వారంతా ఏకమవుతున్నారని విమర్శించారు. వారు చేసే చీకటి యుద్దాన్ని గమనించమని కోరారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెప్పి.. అదే నిజమని నమ్మించే చీకటి యుద్దం రాష్ట్రంలో జరుగుతుందని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక 46 నెలల కాలంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిసి నేరడి ప్రాజెక్టు గురించి మాట్లాడినట్టుగా వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో పంటకు కూడా నీరు అందించేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. గత పాలకులు శ్రీకాకుళం అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. శ్రీకాకుళం.. చెన్నై, ముంబై మాదిరిగా అభివృద్ది అయ్యే అవకాశం ఉన్న గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. ఈ రోజు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం జగన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. చూడాలి మరి జగన్ వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో అని..