Site icon Prime9

MLA Kotamreddy Sridhar Reddy: ఆ ఎమ్మెల్యే పనితీరుకు ఫిదా అయిన సీఎం జగన్

MLA-Kotamreddy-Sridhar-Reddy

Nellore: ఆయ‌నో ఎమ్మెల్యే. నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం పేరిట ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డమే ఆయ‌న ల‌క్ష్యం. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, అధికార ప‌క్షంలో ఉన్నా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాట‌మే స‌రైన మార్గం అనుకుంటారాయ‌న‌. ఆ క్రమంలో రాష్ట్రంలోని ఇత‌ర ఎమ్మెల్యేల‌కు ఆద‌ర్శంగా మారారు ఆ ఎమ్మెల్యే. ఏకంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డే ఆ ఎమ్మెల్యే ప‌నితీరుకు ఫిదా అవుతున్నారంట, ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రు?

ఆయ‌న నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. ఏబీవీపీ కార్య‌క‌ర్త‌గా రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లెట్టి నేడు ఏపీలోని ఎమ్మెల్యేల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారాయ‌న‌. ఇంత‌కీ ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌తేంటో చూద్దాం. ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేసిన శ్రీధ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయంగా ముందుకెళ్లారు. నెల్లూరు న‌గ‌రంలో శ్రీధ‌ర్‌రెడ్డికి ప్ర‌త్యేక స్థానం ఉంది. అప్ప‌టి ఇందిరాభ‌వ‌న్ లో అంద‌రూ శ్రీధ‌ర్ రెడ్డిని శ్రీధ‌ర‌న్న‌గా పిలుచుకుంటూ న‌గ‌రంలో వివిద కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేవారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉండే శ్రీద‌ర్ రెడ్డి ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ వెంట న‌డిచారు. రాష్ట్రంలో జ‌గ‌న్ వెంట న‌డిచిన నాయ‌కుల్లో తొలి నాలుగైదు స్థానాల్లో శ్రీధ‌ర్ నిలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి, ఆనం కుటుంబానికి ఎదురొడ్డి పోరాడి, నెల్లూరు న‌గ‌ర న‌డిబొడ్డులోని గాంధీబొమ్మ వ‌ద్ద వైఎస్సార్ విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌నకు కీల‌క పాత్ర పోషించారు. ఆ ద‌శ‌లోనే నెల్లూరు రూర‌ల్ అభ్య‌ర్థిగా పోటీచేసి భారీమెజార్టీతో గెలుపొంది జ‌గ‌న్ కు బ‌హుమ‌తిగా ఇచ్చారు.

ప్ర‌తిప‌క్షంలో ఉంటూనే రూర‌ల్ నియోజ‌క అభివ్రుద్దిలో కీల‌క బాగ‌స్వామిగా మారారు శ్రీధ‌ర్ రెడ్డి. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎంత‌దూర‌మైనా వెళ్తా అంటూ, పోరాటాలు చేశారు. త‌నకు వ‌చ్చే జీతాన్ని ప్ర‌జ‌ల కోస‌మే ఖ‌ర్చు పెడుతాన‌ని హామీ ఇచ్చి ఆ హామీని నిల‌బెట్టుకున్నారు శ్రీధ‌ర్‌. న‌గ‌రంలోని గాంధీన‌గ‌ర్ స‌మీపంలో ఓ క‌ల్వ‌ర్టు నిర్మాణం కోసం అధికారుల చుట్టూ తిరిగి అల‌సిపోయిన ఆయ‌న కాలువ‌లో నిర్మొహ‌మాటంగా న‌డుములోతుకు దిగి ప‌నిజ‌రిగేంత వ‌ర‌కు బ‌య‌ట‌కు రాన‌ని చెప్ప‌డంతో అధికారులు అక్క‌డిక‌క్క‌డే క‌ల్వ‌ర్టు సాంక్ష‌న్ చేశారు. అంత‌కు ముందు నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర పేరుతో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కి తిరిగిన శ్రీద‌ర్ రెడ్డి రెండో సారి 2019 ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీ సాధించి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇక్క‌డ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా, త‌న పోరాటంలో ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఉమ్మారెడ్డి గుంట‌లో రైల్వే, కార్పొరేష‌న్ అధికారుల మ‌ద్య స‌మ‌న్వ‌య లోపంతో అనేక సంవ‌త్స‌రాలుగా స్థానికులు మురుగునీటితో ఇబ్బంది ప‌డుతుంటే సేమ్ సీన్ రిపీట్ చేశారు. దుర్గంధ‌మైన నీటిలో దిగి స్ప‌ష్ట‌మైన హామీ ఇస్తే కానీ కద‌ల‌న‌ని చెప్ప‌డంతో హామీ ఇచ్చిన అధికారులు స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించారు.

శ్రీధ‌ర్ రెడ్డి త‌న‌దైన రాజ‌కీయాన్ని రూర‌ల్ లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి టీడీపీ జిల్లా అధ్య‌క్షులు అబ్దుల్ అజీజ్ ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా తాను వాటికి స్పందించ‌నంటూ హుందా త‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పైపెచ్చు సిఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కి ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించ‌క‌ముందే తానే గ‌డ‌ప గ‌డ‌ప‌కి శ్రీధ‌ర‌న్న పేరుతో నియోజ‌క‌వ‌ర్గంలోని గ‌డ‌ప‌ల‌కు వెళ్తూ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ని వివ‌రిస్తూ, త‌న బ‌లాన్ని పెంచుకున్నారు. ఈ క్ర‌మంలో అల‌స‌ట‌కు గురై గుండెపోటు వ‌చ్చిన‌ప్ప‌టికీ, తిరిగి కోలుకున్న త‌ర్వాత మ‌ళ్లీ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఓ ద‌శ‌లో రాష్ట్ర ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మైన సీఎం జ‌గ‌న్ శ్రీధ‌ర‌న్న‌ని చూసి నేర్చుకోవాలంటూ ఎమ్మెల్యేల‌కు క్లాస్ పీకార‌ట‌. దీనికి తోడు పార్టీతో సంబందం లేకుండా త‌న అనుచ‌ర గ‌ణాన్ని పెంచుకోవ‌డంలో కోటంరెడ్డి ఓ అడుగు ముందుకేశార‌ని చెప్పొచ్చు. నేను – నా కార్య‌క‌ర్త పేరిట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముఖ్య‌మైన కార్య‌క‌ర్త‌ల ఇంటికి వెళ్ల‌డం, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని చేత‌నైన సాయం చేయ‌డంతో పాటు వారి అభిప్రాయాల‌ను పంచుకుని, పార్టీలో అవ‌స‌ర‌మైన ప‌ద‌వులు ఇచ్చేలా ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ అంశంలో శ్రీధ‌ర్ రెడ్డి సూప‌ర్ స‌క్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

Exit mobile version