Site icon Prime9

Chandra Babu Naidu : స్కాంలు చేయడంలో జగన్ ది మాస్టర్ మైండ్ అన్న చంద్రబాబు.. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ

Chandra Babu Naidu speech in telugu desam party mahanadu 2023

Chandra Babu Naidu speech in telugu desam party mahanadu 2023

Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండ అని.. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ లేని  ఉత్సాహం వస్తుందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు వైభవంగా నిర్వహిస్తున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. సైకిల్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని.. సైకిల్ కు ఎలక్ట్రిక్ హంగులు తీసుకొచ్చామని.. ఇక దూసుకుపోవడమేనని చెప్పుకొచ్చారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమేనని..  జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం అందరిలో కనిపిస్తోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సైకిల్ రెడీగా ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాలకు నాంది పలికిందే టీడీపీ అని, ఎన్టీఆర్ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ అమలు చేసిందని వ్యాఖ్యలు చేశారు.

2029 నాటికి ఏపీని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు చెప్పారు. నష్టపోయిన రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో గట్టెక్కిస్తామని తెలిపారు. సైకో జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని విమర్శించారు. ప్రజావేదికను కూల్చడంతో పాలనను ప్రారంభించిన జగన్.. ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి, రివర్స్ పాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. పోలవరంను గోదావరిలో కలిపేశాడని, రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని చెప్పారు.

తండ్రిలేని బిడ్డను అని చెప్పుకుని, కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య వంటి వాటితో జగన్ అధికారంలోకి వచ్చాడని చంద్రబాబు అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తెస్తానని చెప్పిన జగన్.. కేసుల కోసం కేంద్రం ముందు తల వంచాడని ఎద్దేవా చేశారు. మద్యంపై నిషేధం విధిస్తానని చెప్పి, మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నాడని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్ అని.. రాష్ట్ర ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారని అన్నారు. ప్రతి పేదవాడిని ధనికుడిని చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చెప్పారు.

దిశ చట్టమే లేకపోయినా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారని సీఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. అమ్మఒడి అనేది నాటకమని, నాన్నబుడ్డి వాస్తవమని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో మహానాడులు అవసరమవుతాయని అన్నారు. జలజీవన్ మిషన్ లో మన రాష్ట్రం 18వ స్థానంలో, ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, అప్పుల్లో తొలి స్థానంలో, విదీశీ పెట్టుబడుల్లో 14 స్థానంలో ఉందని.. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంలో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ సహాయ నిరాకరణ చేశాయని చెప్పారు. తిరుమలలో కూడా గంజాయి వ్యాపారం జరగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడో ఉండే అమూల్ ను ఇక్కడకు తెచ్చాడు మన అమూల్ బేబి జగన్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. స్కాంలు చేయడంటో జగన్ ది మాస్టర్ మైండ్ అని అన్నారు. ప్రజలను సర్వనాశనం చేయడానికే జగన్ వచ్చాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రూ. 2 వేల నోట్లు ఎక్కడా కనిపించడం లేదని… అన్ని నోట్లు జగన్ దగ్గరే ఉన్నాయని తెలిపారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ అనే పీ4 విధానంతో పేద వాడిని ధనికుడిని చేసేందుకు నాంది పలుకుదామని చంద్రాబాబు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించిన పనుల వలన దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలించిందని… ఏపీలో విధ్వంసకర పాలన వలన చివర స్థానంలో ఉంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు. వైసీపీ పాలనలో కౌరవ సభగా మారిన అసెంబ్లీని మళ్లీ గౌరవ సభగా మారుద్దామని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం నాయకులు ప్రజలందరితో అనుసంధానం కావాలని చెప్పారు.

Exit mobile version