Site icon Prime9

JP Nadda : ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..

bjp chief jp nadda shocking comments on ysr congress party

bjp chief jp nadda shocking comments on ysr congress party

JP Nadda : ఏపీలో తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పర్యటించియా విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్‌ స్కామ్‌, లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోందని.. శ్రీకాళహస్తిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనను పూర్తి గాలికి వదిలేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం పోవడం వల్లే పనులన్నీ నిలిచిపోయాయని నడ్డా విమర్శించారు. అలానే ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మహిళా నేత పురంధేశ్వరి, పలువురు నేతలు పాల్గొన్నారు.

అదే విధంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను బాధ్యతాయుత పాలిటిక్స్‌ వైపు మళ్లించారని తెలిపారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు ప్రధాని మోదీ మొగ్గు చూపారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మోదీ ప్రధాన మంత్రి అయ్యే నాటికి దేశంలో విద్యుత్‌ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని వివరించారు. ఇవాళ దేశంలో విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామమే కనిపించదన్నారు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండేదని.. ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. దేశంలో 50 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని జేపీ నడ్డా అన్నారు. ఇప్పటికే ప్రజల చికిత్సల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఉజ్వల పథకం కింద రూ. 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిందని జేపీ నడ్డా తెలిపారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు రూ.7,400 కోట్లతో మంచి నీటి పథకం ప్రణాళిక చేశానని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, ఒక్క జిల్లా నీటి కోసమే అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తారని ప్రస్తుత తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆనాడు తనతో గొడవపడ్డారని పేర్కొన్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు తాను ప్రారంభించిన మంచి నీటి పథకాన్ని పక్కనపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇలా పనులు ఆపడం సరికాదని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలు సొంత ఖజానా నింపుకుంటాయి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోవన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

 

Exit mobile version