Site icon Prime9

AP Weather Report : ఏపీలో విచిత్ర వాతావరణం.. ఒక వైపు వర్షాలు,, మరో వైపు భానుడి భగభగలు

ap-weather-report-for upcoming three days

ap-weather-report-for upcoming three days

AP Weather Report : ప్రస్తుతం తెలిగు రాష్ట్రాలలో విచిత్ర వాతావరణం నెలకొంటుంది. ఒక వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వానలు ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం అత్యధికంగా అనంతపురం జిల్లా శెట్టూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు. అలాగే పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో తీవ్ర వడగాడ్పులతో ఎండలు పెరగనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 60 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది అన్నారు. మూడు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వానలు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ రెయిన్ అలర్ట్ చేయడంతో భయపడుతున్నారు. ఇప్పటికే ధాన్యం, పంటలు తడిచి నష్టపోయామని వాపోతున్నారు.

మోచా ఎఫెక్ట్ (AP Weather Report)..

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మోచా’ తుపాను తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో సాగుతోంది. గురు­వారం రాత్రికి పోర్టు బ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో ‘మోచా’ తుపాను ఆగ్నేయ బంగ్లాదేశ్‌, ఉత్తర మయన్మార్‌ మధ్యలో కాక్స్‌ బజార్‌ వద్ద మే 14న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడిందన్నారు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు. ఈ క్రమంలో ఏలూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. భీమడోలు, ద్వారకాతిరుమలలో ఈదురుగాలులు వీచాయి. 120కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. మూడు గ్రామాల్లో 2 రోజులపాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. గాలివాన బీభత్సానికి ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. పి.కన్నాపురంలో చెట్టుకొమ్మ పడి ఆదిలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఈదురుగాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ గాలులకు ఆటోలు కాలువలో కొట్టుకుపోయాయి.

 

Exit mobile version