Site icon Prime9

AP Volunteer : పెన్షన్ డబ్బులు కాజేసి అడ్డంగా బుక్కైన వాలంటీర్.. ఏం చేశాడంటే ?

ap volunteer lost pension amount woth of 89 thousand by playing gambling

ap volunteer lost pension amount woth of 89 thousand by playing gambling

AP Volunteer : ఏపీలో గత కొన్ని రోజులుగా వాలంటీర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో ఎంతటి కలకలం సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే. కాగా కొద్ది రోజుల క్రితమే వాలంటీర్ బనాగరం కోసం ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఇప్పుడు తాజాగా వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అందించే ఆసరా పెన్షన్ డబ్బులతో ఓ వాలంటీర్ జూదం ఆడి.. డబ్బులన్నీ పోగొట్టుకుని విషయం బయటికి రాకుండా డ్రామా ఆడి పోలీసులకు అడ్డంగా బుక్కైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా విడపనకల్లు గ్రామంలో ఓ వాలంటీర్ ప్రతి నెలా మాదిరిగానే ఆగస్ట్ 1న వైఎస్సార్ ఆసరా పెన్షన్ డబ్బులను అధికారుల నుంచి  తీసుకున్నాడు. అయితే తీసుకున్న ఆ రూ.89 వేల నగదును లబ్దిదారులకు పించన్లు ఇవ్వకుండా కొందరితో కలిసి జూదమాడాడు. ఈ క్రమంలో పించన్ డబ్బులతో పాటు చేతికున్న బంగారు ఉంగరం, సెల్ ఫోన్ కూడా పోగొట్టుకున్నాడు. ఈ విషయం బయటపడితే ఉద్యోగం పోతుందని భయపడి ఓ కట్టుకథ అల్లాడు.

ఫించన్ డబ్బులు తీసుకుని గ్రామానికి వెళుతుండగా ఇద్దరు దుండగులు దారిదోపిడీకి పాల్పడినట్లు నమ్మించే యత్నం చేసాడు. తనను కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి తీసుకెళ్ళి బెదిరించారని.. దీంతో ఆ  డబ్బులతో పాటు తన బంగారు ఉంగరం, సెల్ ఫోన్ వారికి ఇచ్చేసినట్లు వాలంటీర్ తెలిపాడు. ఈ మేరకు తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసాడు. అయితే (AP Volunteer) వాలంటీర్ వ్యవహారం కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయం బయట పడింది. అయితే ఈ విషయం బయటికి రాకుండా పలువురు అధికార పార్టీ నేతలు ప్రయతనలు చేస్తున్నారని అందువల్లే ఈ వ్యవహారం జరిగి రెండు రోజులు అవుతున్నా కూడా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ వాలంటీర్ పై చర్యలు తీసుకుని పించన్ డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు.

Exit mobile version