AP Deputy CM Pawan Kalyan Plans South IndianTemple Visits : హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నా వైరల్ ఫీవర్ కారణంగా ఆయన టూర్ వాయిదా పడింది. కాగా, ఇప్పుడు జ్వరం నుంచి కోలుకోవడంతో.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు అయ్యింది..
3 రోజులు.. 7 క్షేత్రాలు
ఈ నెల 12వ తేదీ మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో పవన్ కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించనున్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో.. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారని ఆయన టీమ్ వెల్లడించింది. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ చేపట్టిన ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇది సాహసమే..
సనాతన ధర్మంపై జనసేన విధానాన్ని ఇప్పటికే తిరుపతిలో పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేరళ, తమిళనాడులోని ప్రఖ్యాత ఆలయాలను సందర్శించి ‘సనాతన ధర్మ పరిరక్షణ’ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పర్యటించనున్న తమిళనాడు, కేరళలో ఎన్డేయేకి బద్ధ శత్రువులైన డీఎంకే, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణపై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేకించగా, అక్కడి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఇక కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో పవన్ కల్యాణ్ చేపట్టిన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను వ్యతిరేకించే అవకాశం ఉంది.
కమలానికి బలం
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రాబోయే రెండు మూడేళ్లలో ఎన్నికలు ఉన్నందున పవన్ గనుక గట్టిగా సనాతన ధర్మం గురించి గొంతు విప్పితే ద్రవిడవాదం పేరుతో ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న డీఎంకే కోటకు బీటలు పడతాయిని హిందూ సంస్థలు, సనాతన ధర్మాన్ని ఆచరించే వారు బలంగా నమ్ముతున్నారు. తిరుమలలో లడ్డు వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కదలికను తీసుకువచ్చాయని, ఎంతో చరిత్ర గల గొప్ప దేవాలయాలను తమిళనాడులోని నాస్తిక వాద డీఎంకే నిర్లక్ష్యం చేస్తోందని, ఈ పరిస్థితి మారాలంటే అన్నాడీఎంకేకు పవన్ బలం తోడుకావాలని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇది దక్షిణాదిలో హిందువుల ఐక్యతకు దోహదపడే రాజకీయేతర అంశంగానూ మారుతుందని వారు విశ్లేషిస్తున్నారు.