AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ లో నిర్ణయించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాగా, బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు.
బడ్జెట్ సమావేశాలు కావడంతో శని, ఆదివారాల్లోనూ సమావేశాలు కొనసాగుతాయని చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ఈ నెల 21, 22 న సెలవు ప్రకటించామన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును కూడా సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని ప్రసాదరాజు అన్నారు. మరో వైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి.
ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు.
తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు.
వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నట్టు గవర్నర్ తన ప్రసంగంలో అన్నారు.
సర్వర్ డౌన్ సమస్య ఏపీ సచివాలయానికి తాకింది. శాసనసభ ప్రాంగణాల్లో ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర సమస్య తలెత్తింది.
మంగళవారం ఉదయం నుంచి ఏపీ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో నెట్ నిలిచిందని అధికారులు చెబుతున్నారు.
అయితే , నెట్ వర్క్ సమస్య తలెత్తిన కొద్ది సమయానికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.
ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ నెట్ కనెక్టివిటీ పునరుద్దరణ కాలేని పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్ లేకపోవడంతో అసెంబ్లీ, సచివాలయాలలో ఫేస్ రీడింగ్ డివైజ్ లు పనిచేయలేదు.
మరోవైపు అన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సర్వర్ డౌన్ అవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సర్వర్ డౌన్ అయిందని అధికారులు అంటున్నారు. ఈ సాంకేతిక లోపాన్ని పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.