Vijayawada Murder: విజయవాడలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. చిట్టినగర్ సమీపంలో కుటుంబ కలహాలతో అత్త నాగమణిని అల్లుడు రాజేష్ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. మృతురాలు కుమార్తె తో వివాదం నేపథ్యంలోనే రాజేష్ ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే(Vijayawada Murder)
చిట్టినగర్ సమీపంలోని వైఎస్‌ఆర్ కాలనీ గోగుల గురుస్వామి, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. రెండో కుమార్తె లలితకు.. ఏకలవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేష్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా వారికి ఇద్దరు సంతానం. అయితే గత కొద్దిరోజులుగా లలితకు రాజేష్ కు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ విషయమై పోలీస్ స్టేషన్ వరకు కూడా వీరి పంచాయితీ చేరింది. కాగా ఏడాది కిందట విడాకులు కావాలని లలిత కోర్టును ఆశ్రయించగా.. ప్రస్తుతం విడాకుల వ్యవహరం కోర్టులో నడుస్తోంది. కాగా వచ్చే వాయిదా నాటికి కోర్టు వీరికి విడాకులు ఇచ్చే అవకాశం ఉండడం వల్ల అత్త, మామలు తన భార్యను కాపురానికి పంపకుండా ఆమెను సమర్థిస్తున్నారనే అక్కసుతో రగిలిపోయాడు అల్లుడు రాజేష్. దానితో ఎలాగైనా వారి అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ఇక అనుకున్నదే తడవుగా పక్కా ప్లాన్ ప్రకారం అత్తామమను ఓసారి మాట్లాడదాం రండి అని ఫ్లైఓవర్ ప్రాంతానికి పిలిచాడు. వారు అక్కడకు రాగానే బైక్ పై ఉన్న మామను నరికేందుకు ప్రయత్నించగా ఆయన పారిపోగా.. అత్తకు చేతికి గాయమై అక్కడే ఆగడంతో ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. దానితో తీవ్ర గాయాలపాలైన నాగమణి అక్కడిక్కడే మృతి చెందింది. రాజేష్ ఇక అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.