Andhra Pradesh: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. కొద్దిరోజుల కిందట విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్‌తో కూడిన కేరళ ఉన్నతాధికారుల బృందం మంత్రి కారుమూరితో భేటీ అయింది.
తమకు కావాల్సిన సరుకుల సరఫరా సాధ్యాసాధ్యాల పై చర్చించారు. అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల బియ్యం కావాలని కేరళ ప్రభుత్వం అడగటం శుభపరిణామమని పేర్కొన్నారు. నెలకు 550 టన్నుల ఎండుమిర్చి, కంది, పెసర, మినుములు సైతం సరఫరా చేయాలని కోరిందని తెలిపారు.
ఈ నేపధ్యంలో మంత్రి, అధికారుల బృందం కేరళ పర్యటనకు వెళ్లి పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఏపీ మార్కెఫెట్ ద్వారా సరఫరా చేసే నిత్యావసరాలను కేరళ పౌరసరఫరాల సంస్ద మావెల్లి స్టోర్స్ ద్వారా మార్క్ ఫెడ్ బ్రాండ్ తోనే వినయోగదారులకు అందించనుంది. ఈ ఒప్పందం వలన ఏపీలో బొండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు పెద్ద ఎత్తున మేలు జరగనుంది.