Arogyasri: ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 చికిత్సలను చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వీటితో ఆరోగ్యశ్రీలో అందించే వైద్య చికిత్సల సంఖ్య 3,255కి చేరింది. వైద్య ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు.
తాజాగా పెంచిన వైద్య చికిత్సలతో ఆరోగ్యశ్రీపై ఏడాదికి రూ.2,894 .87 కోట్ల భారం పడుతుందని.. ఆరోగ్య ఆసరా కోసం మరో రూ.300 కోట్లు ఖర్చవుతుందని జగన్‌కి అధకారులు వివరించారు. ఆరోగ్యశ్రీని అత్యంత ప్రతిష్టాతక్మంగా అమలు చేస్తున్నామని.. ఎక్కడా బకాయిలు లేకుండా చూస్తున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్ హిస్టరీని రికార్డుల్లో నిక్షిప్తం చేయాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిరంతరం ఈ రికార్డులను అప్‌డేట్ చేసుకుంటూ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునేలా ఉండాలని ఆయన సూచించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని.. వైద్య ఆరోగ్య శాఖలో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని జగన్ ఆదేశించారు.