Telangana Ministers: తెలంగాణ మంత్రులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఈ నెల 7వ తేదీన తెలంగాణ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా రెండు రోజులుగా శాఖలు కేటాయించలేదు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖల కేటాయింపుపై అధిష్టానంతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్నదానిపై అధిష్టానం ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఈ నేపధ్యంలో 11మంది మంత్రులకి సిఎం రేవంత్ రెడ్డి శాఖలని కేటాయించారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు..(Telangana Ministers)
ఇందులో హోంశాఖ ఎవరికీ ఇవ్వలేదు. ఇంకా ఆరు ఖాళీలున్నందున వచ్చే వారికోసం ఆ పోర్ట్‌ఫోలియోని ఖాళీగా ఉంచారు. అప్పటి వరకూ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ శాఖని చూస్తారు. దీనితోపాటు పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతోపాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం తన వద్దే అట్టిపెట్టుకున్నారు.భట్టి విక్రమార్కకి ఆర్థిక, ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకి వ్యవసాయం, చేనేత, జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్, పర్యాటకం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి పారుదల, పౌరసరఫరాలు కేటాయించారు.దామోదర రాజనర్సింహకి వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకి ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, పొన్నం ప్రభాకర్‌కి రవాణా, బీసీ సంక్షేమం, సీతక్కకి పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమం, కొండాసురేఖకి అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలు కేటాయించారు.