Alai Balai Ceremony: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా అలయ్ బలయ్ వేడుక ఘనంగా జరుగుతోంది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే అలయ్ బలయ్‌కు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ తో సహా పలువురు ప్రముఖులను బండారు దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.
17ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న దత్తాత్రేయ..(Alai Balai Ceremony)
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 17ఏళ్ల క్రితం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో నిర్వహిస్తూ వస్తున్నారు. వేడుకలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. కార్యక్రమానికి వచ్చే అతిధులకు శాఖాహారం, మాంసాహారం వంటకాలు రుచి చూపిస్తారు. అంబలి, చికెన్, మటన్, బోటి, తలకాయ, పాయ, రొయ్యలు, చేపలు, బగారా రైస్, సర్వపిండి, పచ్చి పులుసు, రవ్వ లడ్డు, డబుల్ కామిఠా వంటి దాదాపు 40 రకాల వంటకాలను సిద్ధం చేశారు.