Site icon Prime9

Harirama Jogaiah: పీపుల్స్ మ్యానిఫెస్టో తయారీకి సలహాలివ్వండి.. హరిరామజోగయ్య

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి తక్షణం ఏవైతే అవసరమో వాటిని రాబోయే ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ, జనసేన మిశ్రమ ప్రభుత్వం అమలు జరిపేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామజోగయ్య తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో ఉచితాలు కాకుండా కులాలకు అతీతంగా తెల్లకార్డు కుటుంబాలకు ఉపయోగపడేటట్లుగా ఉండాలనేది తమ అభిమతమని జోగయ్య వెల్లడించారు. పీపుల్స్ మ్యానిఫెస్టోగా తాము కోరుకునే అంశాలను కులాల కతీతంగా మేధావులు, విజ్ఞానవంతులు, వివిధ సామాజిక సంఘ ప్రతినిధులందరూ పంపించాలని కోరారు. తమ సలహాలను ప్రతిపాదన రూపంలో కామన్ మ్యానిఫెస్టోలో చేర్చేవిధంగా ఈ నెలాఖరు వరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పంపించాలని జోగయ్య తెలిపారు.

సూచనలు అందించాలి..(Harirama Jogaiah)

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, విదేశీ విద్య, ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధి వంటి అంశాలపై తమ అభిప్రాయాలను సూచించాల్సిందిగా హరిరామజోగయ్య కోరారు. దీంతో పాటు ఆరోగ్యం – వైద్యం, ఉపాధి, పేదలకు ఇళ్ళు, కరెంటు సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం చేపట్టటం వంటి అంశాలపై అభిప్రాయాలను తెలపాలన్నారు. ఇళ్లు లేని వారికి సరి కొత్త ఇళ్ళ సదుపాయం, నిత్యావసర వస్తువుల సేకరణ, గ్యాస్ బండ, ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని చిన్న చిన్న జబ్బులకు వైద్య సదుపాయం, మందుల కొనుగోలుకు చేయూత వంటి అంశాలపై అభిప్రాయాలు తెలిపాలన్నారు. అధిక పన్నుల చెల్లింపుకు సహకారం వంటి అంశాలపై మేధావులు సూచనలు అందించాలని జోగయ్య సూచించారు.

అన్నదాతకు భరోసా కల్పించే విధంగా రైతు భరోసా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లింల సంక్షేమం కోసం అన్నీ కులసంఘాలకు చేయూతపైనా తమ అభిప్రాయాలు తెలపాలని పిలుపునిచ్చారు. కులసంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఏ విధమైన చేయూత కల్పించాలో తమ అభిప్రాయాలు సూచించాలన్నారు. వీటితోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమం, సుపరిపాలన, అవినీతి నిర్మూలన, అవినీతి పరులకు దండన, పోలీసు జులుం తగ్గించుటకు అవసరమైన విధి విధానాలు ఏవిధంగా ఉండాలో సూచించాలన్నారు. చేతి వృత్తుల వారి సంక్షేమం, డ్వాక్రా, పొదుపు సంఘాల సంక్షేమం, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సంక్షేమం, మధ్య నిషేదంపై మేధావులు సలహాలు, సూచనలు అందించాలని జోగయ్య కోరారు. వీటితోపాటు రాష్ట్రాభివృద్ధి కోసం తమ సలహాలు, సూచనలను తెలియజేస్తే వాటిని పరిశీలించి కామన్ మ్యానిఫెస్టోలో పొందుపరిచేలా కృషిచేస్తామని కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామజోగయ్య వివరించారు

Exit mobile version