ACP Umamaheswara Rao: హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
బినామీ వ్యాపారాలు..(ACP Umamaheswara Rao)
అంతకు ముందు ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బీనామీ ఆస్తులపై కూపీ లాగారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఏసీపీ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు .సోదాల్లో భారీగా నగదు, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల విలువ 3.46 కోట్ల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.