TTD E.O. Dharma Reddy: తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. నేడు మధ్యాహ్నం జరిగే టీటీటీ హైలెవల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.మరోవైపు శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఉదయం 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగుబంటి కనపడింది. దీనితో భక్తులు భయంతో పరుగులు తీసారు.
తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత ఘటనతో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. అడవి జంతువులు నియంత్రణపై ఈ ఉదయం నిపుణులు సమావేశమయ్యారు. నడక మార్గంలో ఇరు వైపులా ఉన్న పొదలని తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. దుకాణాల్లో వేస్టేజ్‌తో జంతువులు వస్తున్నాయని గుర్తించారు. దుకాణాల్లో వేస్టేజ్‌తో జంతువులు వస్తున్నాయని ఓ అంచనాకి వచ్చారు. నడక మార్గంలో ఎన్‌జిఓల సహకారంతో సిసి కెమెరాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 15 ఏళ్ళలోపు పిల్లలతో వెళ్ళే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వెటర్నరీ టీమ్స్‌ని అందుబాటులో ఉంచాలని టిటిడిని నిపుణులు కోరారు. హై లెవల్ కమిటీ నిర్ణయాలపై టిటిడి పాలక మండలికి నివేదిక ఇస్తామని అడిషనల్ సిసిఎఫ్ శాంతి ప్రియ పాండే మీడియాకి చెప్పారు.
తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితని చంపింది, ఇప్పుడు పట్టుబడింది ఒకటే చిరుత అయితే దానిని ఇక అడవిలోకి పంపించబోమని అటవీ శాఖ అడిషనల్ సిసిఎఫ్ శాంతి ప్రియ పాండే ప్రకటించారు. నెల క్రితం దొరికిన పులి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని ఆమె చెప్పారు. ఇప్పుడు లక్షితని చంపిన ప్రదేశంలో దొరికిన రక్తం, వెంట్రుకలని కూడా సేకరించామని శాంతి ప్రియ తెలిపారు. ఇవాళ దొరికిన పులి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించి డిఎన్ఎ విశ్లేషణ చేస్తామని శాంతిప్రియ చెప్పారు. ఒకవేళ లక్షితని చంపిన పులి, ఇప్పుడు దొరికిన పులి ఒకటే అయితే ఇక ఎప్పటికీ దాన్ని జూపార్కులోనే ఉంచుతామని శాంతిప్రియ తెలిపారు. మనిషి మాంసానికి అలవాటు పడిన పులిని అడవిలో వదలడానికి నిబంధనలు ఒప్పుకోవని శాంతిప్రియ వెల్లడించారు.