Yemen Stampede : యెమన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని సనాలోని ఓల్డ్ సిటీలో రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. అరేబియా ద్వీప కల్పంలోనే అత్యంత పేద దేశంగా యెమెన్ ఉంది. ఈదుల్ ఫితర్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఓ చారిటీ పంపిణీ కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరగగా 80 మందికి పైగా మృతి చెందారని.. వందల మందికి గాయాలు అయ్యాయని హౌతీ భద్రతా అధికారి తెలిపారు. కాగా చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హౌతీ నియంత్రణలో ఉన్న రాజధానిలోని సహాయం పంపిణీ చేస్తున్న పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. బంధువుల ఆచూకీ కోసం ప్రజలు సంఘటనా స్థలానికి తరలి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతం చుట్టూ భారీగా మోహరించారు. పంపిణీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
మృతులను, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా ఆర్థిక సాయాన్ని సరిగ్గా పంపిణీ చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ అబ్దెల్-ఖాలిక్ అల్-అఘరీ వెల్లడించారు. ఈద్-ఉల్-ఫితర్ ముందు ఈ విషాదకర ఘటన చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించిందని పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఒక పాఠశాలలో ఈ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే సంఘటన తర్వాత తిరుగుబాటు దారులు ఆ పాఠశాలను మూసివేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఎవరినీ అక్కడికి రాకుండా నిషేధం విధించారు.
Atleast 90 Person Killed, Hundreds Injured In Stampede During Yemen Charity Event. #Stampede #Yemen pic.twitter.com/oeSsRufPsj
— Globaltoday (@globaltwoday) April 20, 2023
మృతదేహాలు కుప్పలుగా పడివున్న దృశ్యాలను స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సహాయక సామగ్రిని సొంతం చేసుకునేందుకు జనం పోటీపడడం, ఒకరినొకరు నెట్టుకుంటూ, ఒకరి తలపై మరొకరు నడుచుకుంటూ వెళ్లడంతోనే ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. మృతదేహాలతోపాటు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాటకు కారణమైన వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారన్న కచ్చితమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నామని, ఘటనపై విచారణ చేపట్టామని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మరోవైపు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు ప్రజలను నియంత్రించేందుకు గాలిలోకి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. కాగా, ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నామని, ఘటనపై విచారణ చేపట్టామని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. యెమెన్‌లో 8 ఏళ్లకుపైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలో అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.