Site icon Prime9

Venu Swamy: వేణుస్వామికి మరో షాక్‌ – రెండోసారి నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్‌

A Shock to Venu Swamy: సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో షాక్‌ తగిలింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు మహిళా కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరవ్వాలంటూ తాజాగా ఉమెన్‌ కమిషన్‌ ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చింది. కాగా వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయన వివాదాల్లోనూ చిక్కుకుంటారు.

ఇటీవల నాగచైతన్య-శోభితల ఎంగేజ్‌మెంట్‌ తర్వాత వారి జాతకం ఇదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి జాతకాలను విశ్లేషిస్తూ.. ఈ జంట ఎక్కువ రోజులు కలిస ఉండదని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. సినీ ప్రముఖుల జీవితాలపై ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్న ఆయనపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌, తెలుగు ఫిల్మ్‌ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయనకు మొదట మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. దీంతో వేణుస్వామి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఆయన పటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కమిషన్‌కు సూచించింది. ఆ తర్వాత ఇటీవల మరోసారి ఈ కేసు విచారించిన న్యాయస్థానం వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చని కమిషన్‌ని ఆదేశిస్తూ తీర్పు వెలువరిచింది. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ తాజాగా మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

మరి ఈ నోటీసులపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా నాగచైతన్య, శోభితల జాతకం వీడియో రిలీజ్ చేసిన రెండు రోజుల్లోనే వేణుస్వామి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఎప్పుడు ఏ సెలబ్రిటీ జాతకాలు చెప్పానని, ఇది కేవలం వారి మంచి కోసమే చెప్పానంటూ తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. అంతేకాదు బహిరంగంగా ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. కానీ అప్పటికే వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఈయనపై ఫిర్యాదు వెళ్లడంతో కమిషన్‌ ఆయనకు నోటీసులు ఇచ్చింది.

ఇదిలా ఉంటే గతంలోనూ వేణుస్వామి నాగచైతన్య-సమంత జాతకంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లయిన నాలుగు ఏళ్లకే విడిపోతారంటూ ఆయన వారి జాతకాన్ని విశ్లేషించారు. ఇక ఆయన చెప్పినట్టుగానే నాలుగేళ్లకే సమంత-నాగచైతన్యలు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఇటీవల చై-శోభితల జాతకాన్ని విశ్లేషించిన వేణుస్వామి చై-సామ్‌ల కంటే వీరిది మరింత దారుణంగా ఉందన్నారు. వీరద్దరి జాతకాలు అస్సలు కలవలేదని, పెళ్లయిన మూడేళ్లకే విడిపోతారంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు ఓ అమ్మాయి వల్ల వీరిద్దరి వైవాహిక జీవితంలో కలతలు వచ్చే సూచనలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version