IPS Transfers: ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని సూచించింది. సదరు అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని స్పష్టం చేసింది. విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది.
విపక్ష నేతల ఫిర్యాదుతో..(IPS Transfers)
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల వ్యవహారశైలిపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మరి కొందరు విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో భద్రతా వైఫ్యల్యాలతో పాటు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్ డీజీ ఇబ్బంది పెట్టినట్లు విపక్ష నేతలు ఎన్నికల సంఘానికి తెలిపారు. చాలా మంది విపక్ష నేతల అక్రమ అరెస్టులకు కూడా ఆయనే బాధ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీగా కొనసాగుతున్న వ్యక్తి అధికారాలను ఉపయోగించుకుని విపక్ష నేతలను వేధిస్తున్నట్లు సీఈసీకి ఫిర్యాదు చేశారు.
విజయవాడ సీపీ కాంతిరాణా.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ చిన్నా చితకా కారణాలకు కూడా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని, సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాలమేరకే సీపీ నడుచుకుంటున్నారని విపక్ష నేతలు సీఈసీకి స్సప్టం చేశారు. ఇటీవల సీఎంపై జరిగిన రాయిదాడి ఘటనకు సంబంధించి కూడా కాంతిరాణాను సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.