TS Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30 న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అదే విధంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న భారీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ తో పాటు..
అనంతరం జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమర వీరుల స్థాపాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
నూతన సచివాలయానికి డా. బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే.
పనులను పరిశీలించిన కేసీఆర్(TS Secretariat)
నూతన సెక్రటేరియట్ పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సచివాలయ పనులను పర్యవేక్షించారు. అక్కడ రోడ్లను కూడా ఆయన పరిశీలించారు.
నిర్మాణాల చుట్టూ కలియతిరుగుతూ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను కూడా అడిగి తెలుసుకున్నారు. తుది దశలో చేయాల్సిన పనులపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో నిర్మాణం
కాగా, పాత సచివాలయాన్ని కూల్చి వేసి దాదాపు రూ. 617 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని అద్భుతంగా చేపట్టింది తెలంగాణ సర్కార్.
అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా సచివాలయ భవన నిర్మాణం జరిగింది.
అయితే నూతన సచివాలయాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కానీ, అప్పటికి సచివాలయ పనులు ఇంకా పూర్తి కాలేదు.
దాంతో పాటు బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సచివాలయ ప్రారంభోత్సవం మొదటిసారి వాయిదా పడింది.
ఆ తర్వాత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు.
దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
దీంతో ఎన్నికల కోడ్ కారణంగా రెండో సారి కూడా ప్రారంభోత్సవం వాయిదా పడింది.