Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు.. కీలక దశకు చేరిన విచారణ

Telangana Govt Extends Deadline for Kaleshwaram commission: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బ్యారేజిల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం శనివారం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకే కమిషన్‌కు గడువు ఉండటంతో మరో రెండు నెలలపాటు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచుతూ ఇరిగేషన్, కాడ్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

మార్చి నుంచి పనిలో..
కాళేశ్వరం కమిషన్ కి జస్టిస్ పీసీ ఘోష్‌ను ఛైర్మన్‌గా నియమించి, కీలక పత్రాలను అప్పగించి విచారణ ఆరంభించాలని కోరింది. కాగా, ఏప్రిల్ నుంచి ఈ విచారణ ప్రక్రియ మొదలైంది. తొలుత కమిషన్‌కు 100రోజుల గడువు నిర్ధేశించగా, లోతుగా విచారణ జరపాల్సి రావటంతో ప్రతి రెండు నెలలకోసారి కమిషన్ గడువును పొడిగిస్తూ వస్తున్నారు. విచారణ కీలక దశకు చేరుకోగా.. సాంకేతిక పరమైన విచారణను, ఆర్థిక, ప్రభుత్వ విధి విధానాల పరమైన విచారణను కమిషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆర్థిక, ఇరిగేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులను కమిషన్ విచారించనుంది. మరో 15మంది కీలక అధికారులను విచారణకు పిలువనున్నారు.