Supreme Court has ordered the CBI and ED about Jagan Assets Case: ఏపీ మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ దరఖాస్తుల వివరాలు అందించాలని చెప్పింది.
అయితే, సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. కాగా, అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.
ఇదిలా ఉండగా, జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి కేసు విచారణ ఆలస్యం అవుతోందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గతంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరగా.. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా దర్మాసనం విచారణను చేపట్టింది.
ఈ విచారణలో ఇరు వర్గాల మధ్య వాదనలు విన్న ధర్మాసనం .. రోజువారీగా తెలంగాణ హైకోర్టు విచారణకు ఆదేశించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని ధర్మాసనం ప్రశ్నించగా.. డిశ్చార్జ్‌తో పాటు వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్ వంటి కారణాలు ఉన్నాయని న్యాయవాదులు తెలిపారు.
అందుకే పెండింగ్ కేసుల వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు వివరించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో పాటు ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.