Sri Lankan President Anura Dissanayake to visit India: శ్రీలంక అధ్యక్షుడు అనురా దిస్సనాయకె ఈ నెల 15న భారత పర్యటనకు రానున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడితో బాటు ఆ దేశ ఆరోగ్య మంత్రి నలిందా జయతిస్స, విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరత్, ఆర్థిక శాఖ ఉపమంత్రి అనిల్ జయంత ఫెర్నాండో తదితరులు పాల్గొననున్నారు. రెండేళ్ల క్రితం ఆర్థికసంక్షోభంతో దివాలా అంచుకు చేరిన శ్రీలంకలో ప్రజావ్యతిరేక ఉద్యమాలు ఆకాశాన్నంటాయి. ప్రజల నిరసన ధాటికి దేశాధ్యక్షుడే రాజీనామా చేయగా, తాత్కాలిక అధ్యక్షుడి నేతృత్వంలో పాలన సాగింది. మొత్తానికి ఈ ఏడాది సెప్టెంబరు 22న జరిగిన ఎన్నికల్లో దేశ చరిత్రలోనే తొలిసారి వామపక్ష పార్టీగా గుర్తింపు పొందిన జనతా విముక్తి పెరమున ప్రధాన భాగస్వామిగా ఉన్న 28 పార్టీల నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) కూటమి తరపున దిస్సనాయకె విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టారు. దిస్సనాయకె నాయకత్వంలోని కూటమి.. నవంబరు 15న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించటంతో అక్కడి పార్లమెంటు మీదా దిస్సనాయకే పట్టుసాధించారు.
ఒకప్పుడు శ్రీలంక అధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైన నేతలు న్యూఢిల్లీని సందర్శించటం ఆనవాయితీగా ఉండేది. కానీ, మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ పాత ఆనవాయితీని పక్కన బెట్టి.. లంకలో దిస్సనాయకె గెలిచిన పదిహేను రోజుల్లోనే విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను శ్రీలంకకు పంపారు. అంతేకాదు.. గెలిచిన తర్వాత దిస్సనాయకెను కలిసిన తొలి విదేశీ ప్రముఖుడూ జైశంకర్ కావటం గమనార్హం. ఈ పర్యటనలో కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన జైశంకర్.. తమ దేశంలో పర్యటించాలని కోరారు. ఆది నుంచి భారత్ వ్యతిరేక భావనలు గల పార్టీ అధినేతగా ఉన్న దిస్సనాయకె అధికారంలోకి వచ్చాక.. లంకలోని పరిస్థితుల దృష్ట్యా భారత్ పట్ల తన ధోరణిని మార్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకున్నారని భావించాల్సి వస్తోంది. అయితే, దిస్సనాయకె పర్యటనను.. అటు చైనాతో సహా మన పొరుగుదేశాలతో బాటు పలు ప్రపంచ దేశాలూ ఆసక్తిగా గమనిస్తున్నాయి.
కారణాలేమైనప్పటికీ గత కొంతకాలంగా పొరుగు దేశాలతో న్యూఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటం, ఆ దేశంలో చైనా ప్రాబల్యం పెరగడం న్యూఢిల్లీని కలవరపెట్టాయి. ఇక.. వాయువ్య భాగాన ఉన్న పాకిస్థాన్ నుంచి నిరంతర ముప్పు ఉండనే ఉంది. నేపాల్‌లో 2008లో రాజకుటుంబం హత్య తర్వాత తరచూ అక్కడ ప్రభుత్వాలు మారిపోవటం, వామపక్ష పార్టీలు అధికారంలోకి రావటం, ఆ దేశం మీదా చైనా తన పట్టును పెంచుకోవటం భారత్‌కు ఇబ్బంది కలిగించే పరిణామాలుగానే ఉన్నాయి. మరో పొరుగు దేశమైన మయన్మార్‌లో 2021లో ఆంగ్ సాన్ సూకీని అక్రమంగా గద్దెదించిన అక్కడి సైన్యం, మిలిటరీ పాలనకు పూనుకోవటంతో ఆ దేశంలోనూ పరోక్షంగా అంతర్యుద్ధం సాగుతోంది. ఇక మాల్దీవుల నాయకత్వం.. చైనా, భారత్‌లను ఏకకాలంలో సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే బంగ్లాదేశ్‌లోని ప్రజా పోరాటాలతో న్యూఢిల్లీకి నమ్మిన బంటు అయిన హసీనా గద్దెదిగటంతో అక్కడా ప్రతికూల వాతావరణమే ఉంది. ఇక.. దశాబ్దాలుగా మన పొరుగునున్న చైనా, మన పొరుగు దేశాలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఆర్థికంగా, సైనికంగా సాయం అందిస్తూ తనదైన శైలిలో ముందుకుపోతోంది. దీనికి విరుగుడుగా న్యూఢిల్లీ కూడా పొరుగుబంధాన్ని బలపరచుకుంటోంది.
భారత్, శ్రీలంక దేశాల మధ్య వేలాది ఏండ్లుగా చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. దీంతో ఆదినుంచీ లంక అభివృద్ధికి ఇండియా అన్ని విధాలా అండగా నిలుస్తూ వచ్చింది. మరోవైపు, కోవిడ్ అనంతర పరిణామాల వల్ల లంక జనాభాలో 27 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. అధిక వడ్డీల మూలంగా వ్యాపారులు, పెట్టుబడి దారులు, ఉత్పత్తిదారులు బాగా దెబ్బతిన్నారు. దీంతో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగాలు లేకుండా పోయాయి. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గినా, ఎక్కువగా మహిళలకు ఉద్యోగ అవకాశాలిచ్చే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడడం వల్ల మహిళా నిరుద్యోగిత పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల వాటా 75 శాతంగా ఉండటం, ఇవన్నీ ఎగుమతులు, దిగుమతుల మీదనే ఆధారపడటం, దేశంలోని మొత్తం కొలువుల్లో 45 శాతం ఈ రంగానివే కావటంతో సమస్య అధికంగా ఉంది.
కోవిడ్ తర్వాతి సంక్షోభంలో (2022లో) 5,100 కోట్ల డాలర్ల విదేశీ రుణ బకాయిలను చెల్లించలేక చేతులెత్తేసిన శ్రీలంకకు గత రెండేళ్లలో మనదేశం 400 కోట్ల డాలర్లు ఇచ్చి ఆదుకొంది. ఇది ఐఎంఎఫ్, చైనా అందించిన సహాయం కన్నా అధికం. లంక రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థతో పాటు ఇతర విదేశీ రుణదాతలనూ మోదీ నాయకత్వం ఒప్పించింది. మరోవైపు, 2023 ఫిబ్రవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ సుమారు రూ. 3,700 కోట్ల పెట్టుబడితో మన్నార్, పూనగారిలో విండ్ ఫార్మ్స్‌ను అభివృద్ధి చేసింది. అలాగే, శ్రీలంకతో ఇండియాను కలుపుతూ భూమార్గం నిర్మించాలనే ప్రతిపాదననూ భారత్ పరిశీలిస్తోంది. ఇది సాకారమైతే ఇరు దేశాల మధ్య బంధంతో బాటు వాణిజ్యమూ బాగా పెరుగుతుందని భావిస్తోంది. మరోవైపు, గతంలో రెండు దేశాలు చేసుకున్న భారత – శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’చేసుకొన్నాయి. గత రెండు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 4 నుండి 6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగినా, అందులో భారత్ నుంచి వెళ్లిన ఎగుమతుల వాటాయే ఎక్కువ. ఈ నేపథ్యంలో తొలిసారి అధ్యక్ష హోదాలో న్యూఢిల్లీ రానున్న అనుర దిస్సనాయకేతో హస్తిన యంత్రాంగం నిజాయితీగా చర్చలు జరపాల్సి ఉంది. అప్పుడే శ్రీలంక- భారత సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాగలదు.