Sri Lanka: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సతీ సమేతంగా దేశం విడిచి పారిపోయాడు. తొలుత వాయు, జల మార్గాల ద్వారా దేశం నుంచి పారిపోయేందుకు యత్నించిన రాజపక్సేకు అధికారులు ఏమాత్రం సహకరించలేదు. అడుగడుగున అడ్డుకున్నారు.
మిలటరీలోని గొటబాయ సన్నిహితులు కొందరు అతన్ని దేశం దాటించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ విమానంలో సోదరులందరితో కలిసి దక్షినాసియా మీదుగా మాల్దీవులకు పారిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులతో రాజపక్సే వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక గొటబాయ రాజపక్సే ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. 13వ తేదీతో ఉన్న లెటర్ హెడ్‌తో తన రాజీనామా పత్రాన్ని పార్లమెంటు స్పీకర్‌కు పంపించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. అయితే, దీనిపై ఇవాళ స్పీకర్ అబేయవర్దనే అధికారిక ప్రకటన చేయనున్నారు.
ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల మేరకు ఈ నెల 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ 19న చేపట్టనున్నట్టు తెలిపారు.