Site icon Prime9

Telangana: సంక్రాంతికి ముందే రైతు భరోసా.. కాసేపట్లో విధి విధానాలపై స్పష్టత!

Rythu Bharosa Funds To Be Released before Sankranti: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసాపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రైతు భరోసాపై గురువారం క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ మేరకు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనుంది. అయితే ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ పలు మార్లు భేటీ కాగా.. రైతు భరోసా విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించిన విషయం తెలిసిందే.

అయితే, సంక్రాంతి కానుకగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తూనే.. సంక్రాంతి పండుగ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పథకంలో భాగంగా రైతులకు ప్రతీ ఏడాది సాగు చేసే పంటకు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఈ పథకాన్ని సంక్రాంతికి శ్రీకారం చుట్టనుంది. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌లో ఈ పథకం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. ఎందుకంటే గతంలో రైతు బంధు ద్వారా 21వేల కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం వేగం పెంచింది. క్యాబినెట్ సబ్ కమిటీ సైతం తీర్మానం చేయడంతో ఇవాళ విధి విధానాలపై సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఓ కొలిక్కి రానుంది. అయితే రైతు భరోసా సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వనుందా? భూమి ఉన్న ప్రతి రైతుకు అమలు చేయనుందా? కొన్ని ఎకరాల వరకే పరిమితి విధించనుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

అయితే, ప్రధానంగా రైతు భరోసా పథకానికి టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండనుందని సమాచారం. దీంతో పాటు 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం తెలుసుకునేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరించినట్లు సమాచారం. అయితే రైతు భరోసాకు సీలింగ్ పెట్టడంపై భేటీలో చర్చించనుంది. జనవరి 4వ తేదీన జరగనున్న క్యాబినెట్ భేటీ ముందు సబ్ కమిటీ నివేదిక ఉంచనుంది.

Exit mobile version
Skip to toolbar