Site icon Prime9

AP Government: కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌.. 18 నెలల్లో శాశ్వత భవన నిర్మాణానికి రంగం

Registrar asks Kurnool admin to find suitable buildings land for High Court Bench in Kurnool: తాము అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్‌ని కర్నూల్లో పెడతామని నాడు ప్రకటించిన కూటమి నేతలు.. తాజాగా ఆ వాగ్దానం అమలుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా, దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు స్థలం, వసతుల అధ్యయనం కోసం కలెక్టర్‌ నాయకత్వంలోని టీమ్ రంగంలోకి దిగింది.

రిజిస్ట్రార్ ఆదేశాలు..
కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు నిర్ధిష్ట సమాచారం సేకరించి, ఒక సమగ్ర నివేదికను పంపాంటూ ఇటీవల రిజిస్ట్రార్   జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో 15 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఛాంబర్లు, కోర్టు కాంప్లెక్స్‌, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయమూర్తులకు వసతి, నివాస గృహాలకు సంబంధించిన అంశాలను రిజిస్ట్రార్ తన లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ సీనియర్ ఇంజనీర్, నగర పాలక సంస్థ కమిషనర్, ఆర్డీవోలు రంగంలోకి దిగారు.

తాత్కాలిక భవనం కోసం..
ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువుగా ఉండే భవనాలను కలెక్టర్ బృందం పరిశీలించింది. ఏపీఈఆర్‌సి, 2వ పోలీస్ బెటాలియన్‌ భవనాలను అధికారులు పరిశీలించి, వాటిలోని అనుకూలతలు, ఇబ్బందుల గురించి చర్చించుకున్నారు. అదే సమయంలో శాశ్వత బెంచ్ నిర్మాణానికి అనుకూలమైన స్థలం అన్వేషణ కూడా సాగుతోంది. ఒకసారి తమ నివేదకకు న్యాయవర్గాల నుంచి ఆమోదం వస్తే.. ఏడాదిన్నర కాలంలోనే అన్ని హంగులతో హైకోర్టు శాశ్వత బెంచ్ కోసం నూతన భవనాన్ని నిర్మించాలని సర్కారు యోచిస్తోంది.

సీమవాసుల చిరకాల ఆకాంక్ష
ఉమ్మడి మద్రాసు నుంచి 1952లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధానిగా ప్రకటించగా, నాడు గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. కానీ, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించినప్పుడే సీమ నేతలు కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేసినా, పాలనా సౌలభ్యం కారణంగా అది ఆచరణకు నోచుకోలేదు. అయితే, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించటంతో బాటు అక్కడే హైకోర్టును నిర్మించటంతో.. తమ ప్రాంతంలో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. గత ఎన్నికల వేళ దీనికి సరేనన్న కూటమి నేతలు.. నేడు దాని ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar