Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎంపికయ్యారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమైన దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనను ఎన్నుకున్నారు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 07:24 PM IST

Sri Lanka: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎంపికయ్యారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమైన దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనను ఎన్నుకున్నారు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయన పై పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. దేశంలో శాంతిభద్రతలు యధాతథ స్థాయికి తేవాల్సిన బాధ్యత కూడా రణిల్‌దే.

ఇక పోలింగ్‌ సరళిని చూస్తే రణిల్‌కు 134 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి డుల్లుస్‌ అల్హా పెరుమాకు 82 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత వారం శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచిపారిపోవడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. గొటబాయ ముందుగా మాల్దీవ్‌స్‌కు చేరుకోవడం అక్కడ స్థానిక లంకేయుల నుంచి నిరసన సెగ తాకడంతో సింగపూర్‌ వెళ్లిపోయారు. సింగపూర్‌ ప్రభుత్వం కూడా ఆయనకు 15 రోజుల పాటు మాత్రమే దేశంలో ఉండటానికి అనుమతించింది. ఇక అటు నుంచి గొటబాయ పయనం ఎటు ఇతమిద్దంగా తెలియదు.

శ్రీలంక నిరసనకారులు రణిల్‌ పై కూడా ఆ్రగహంతో ఉన్నారు. ఆయన రాజీనామను కూడా డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనకారులు ఆయన ప్రైవేట్‌ ఇంటిని కూడా తగులబెట్టారు. కొలంబోలోని ప్రధామంత్రి కార్యాలయంలోకి దూసుకుపోయి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినా, ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడి నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా నవంబర్‌ 2024 వరకు దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు.

ప్రస్తుతం శ్రీలంక పూర్తిగా దివాలా తీసింది. ముఖ్యంగా ఆహార కొరత, ఇంధన కొరతతో పాటు ఇతర నిత్యావసర సరకుల కొరతతో సతమతమవుతోంది. విక్రమసింఘే ముందుగా రాజకీయ సుస్థిరత సాధించాల్సి ఉంటుంది. వెంటనే అంతర్జాతీయ ద్రవ్యనిధితో బెయిల్‌ ఔట్ ప్యాకేజీ గురించి చర్చలు మొదలుపెట్టాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైంది.

రాజపక్స మిత్రపక్షపార్టీకి చెందిన విక్రమసింఘేను అధికార ఎస్‌ఎల్‌పీపీ ఎంపిక చేసింది. అయితే అధికార ఎస్‌ఎల్‌పీపీకే చెందిన అసంతృప్త ఎంపీ మాజీ విద్యాశాఖ మంత్రి అల్హాపెరుమా నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. కాగా పెరుమాకు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. మొత్తానికి శ్రీలంకలో విజయం మాత్రం రణిల్‌ విక్రమసింఘేను వరించింది. ఇక ఆయన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తారో వేచిచూడాల్సిందే.